శ్రీయాదాద్రి ప్రతినిధి : దక్షిణ కాశీగా పేరుగాంచిన కొలనుపాక ప్రాచీన, వీరశైవ, వైష్ణవ, జైనమతాల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. నాటి ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు అభిరుచులకు, శిల్పకళలకు ఈ ప్రాంతం నేటికీ అద్దం పడుతూనే ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రామం నేటికీ జాతీయ స్థాయిలో పర్యాటకులను కనువిందు చేస్తూనే ఉంది. హైదారాబాద్‌కు 70 కిలోమీటర్లు, ఆలేరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన జైన దేవాలయంతో పాటు అతి ప్రాచీనమైన, దక్షిణ కాశీగా పేరుగాంచిన కోటిలింగాలకు నెలవైన శ్రీస్వయంభూ సోమేశ్వరాలయం కూడా ఇక్కడ ఉన్నది. శివుడు ఇక్కడ కొలువుదీరి ఉన్నట్లు శివపురాణంలో పేర్కొనబడి ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం ఆరంభంలో జగద్దేవుడు అనే రాజు నిర్మింపజేశారు. ఈ ఆలయానికి చుట్టూ అష్ట దిక్పాలకుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయానికి కొల్లూరు, కొలనుపాక, వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామాలను అప్పటి పాలకులు దానంగా ఇచ్చారని ఇక్కడి శాసనలలో ఉంది. అంతేగాకుండా వీరనారాయణస్వామి ఆలయం కూడా అత్యంత పురాతమైంది. యాదగిరిగుట్ట నుంచి కొలనుపాకకు 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.