
అక్టోబర్ 11 నాటికి యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తి
శ్రీయాదాద్రి ప్రతినిధి : ప‌్రజలకు ప్రభుత్వ పాలన చేరువ చేయడం.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయడానికి సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారు. అరకొర వసతులతో జిల్లాల పాలన మొదలై రెండేళ్లు పూర్తవుతున్నది. తెలంగాణకు తలమాణికమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విస్తరణ పనులు రూ. 2000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019 బ్రహ్మోత్సవాల నాటికి ప్రధానాలయం పూర్తి కావడం ద్వారా స్వామి వారి నిజ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో రూ. 2, 337 పెట్టుబడులతో జిల్లాలో పరిశ్రమల స్థాపన జరిగింది. యాదాద్రి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పర్యాటక రంగం పుంజుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలపై భరోసా పెరిగింది. కొత్తగా స్థాపించిన 201 పరిశ్రమలలో పారిశ్రామిక విప్లవం జిల్లా ప్రజలకు అందివచ్చింది. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన సీఎం కేసీఆర్ జిల్లాలో 1, 85, 847 మంది రైతులకు 1, 89, 363 చెక్కుల ద్వారా రూ. 208.68 కోట్లను వ్యవసాయ పెట్టుబడి సాయం కింద పంపిణీ చేశారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న ఆధారాలతో సంబంధిత రికార్డులను పరిశీలించి, క్షేత్ర పరిశీలన చేసి అవసరమైన సవరణలు చేసి మొత్తం 7, 38, 439 ఎకరాల భూమి 91 శాతం సరైనదిగా, మిగతా 9 శాతం భూమి వివాద రహితముగా ఉన్నట్లు గుర్తించారు. దశాబ్దాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న భూసమస్యలను రెవెన్యూ యంత్రాంగం నాలుగు నెలలు ఎంతో శ్రమించి పరిష్కరించారు.

స్పూర్తివంతంగా కలెక్టర్ అనితారామచంద్రన్ పాలన
2016 అక్టోబర్ 11న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌కు అనితారామచంద్రన్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి పాలన పగ్గాలను చేపట్టారు. దూకుడుగా కర్తవ్య పాలన చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యల పరిష్కారానికి మూలాలంటూ ఒకవైపు కలెక్టర్, మరోవైపు డీసీపీ ఈ. రామచంద్రారెడ్డి నిత్యం ప్రజల మధ్యన ఉంటున్నారు. కొత్త జిల్లా పాలన ఏర్పడి గురువారం నాటికి రెండేళ్లు గడిచింది. రెండేళ్ల పాలనపై అధికారులు సంతృప్తిగా ఉన్నారు. ఒకవైపు మౌళిక వనరులు లేకపోయినా రాజీపడుతూ ప్రజల సమస్యలపై సమరం పూరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అధికారుల్లో చాలామంది యువకులే ఉండడం విశేషం. ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను తయారు చేసి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. జేసీ రమేష్ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగక శ్రమిస్తున్నారు. గ్రామ స్వరాజ్యమే రామ రాజ్యమని జాతిపిత గాంధీ మాటలను నిజం చేసేందుకు జిల్లా పంచాయతీ శాఖ అధికారులు డీఆర్‌డీఓ మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ సారధ్యంలో క్షేత్రపర్యటనలకు శ్రీకారం చుట్టడం వల్ల ఇతర శాఖల అధికారులు కలెక్టర్ స్పీడును అందుకోవడానికి పోటిపడుతున్నారు. సామాన్యుడు తన సమస్యను తీసుకుని కలెక్టరేట్‌కు రాకముందే పనులు చేసిపెట్టాలన్నది కలెక్టర్ సంకల్పం.

ఆదర్శంగా మహేష్‌భగవత్ పోలీసింగ్
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసులకు ఇస్తున్న స్పూర్తికి తోడు డీసీపీ ఈ. రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో అత్యుత్తమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 57 మంది పిల్లలను రక్షించారు. సీఎం కేసీఆర్ కల్పిస్తున్న ఆధునాతన సౌకర్యాలను ఉపయోగించుకుంటూ నిఘా వ్యవస్థను మెరుగుపర్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో జిల్లాలో అనేక నేరాలను అరికడుతున్నారు. యాదాద్రి పోలీసులు వ్యభిచార నిర్మూలన విషయంలో కూడా ఎంతో మెరుగైన ప్రగతిని సాధించారు. లాడ్జీలపై కొరడా ఝుళిపించారు. షీటీమ్స్ ఏర్పాటుతో యువతులు, మహిళలకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న వ్యభిచారంపై ఉక్కుపాదం మోపారు. గణేష్‌నగర్‌లో వ్యభిచారం పూర్తిగా నిలిచిపోయింది. 30 మంది వ్యభిచార నిర్వాహకులపై పీడియాక్టు నమోదు చేశారు. 35 మంది మైనర్ బాలికలను రక్షించి విముక్తి కల్పించారు.
భూగర్భజలాలను వృద్ధి చేసిన మిషన్ కాకతీయ పనులు
తెలంగాణ రాష్ట్రంలోని 46, 000 చెరువులను పునరుద్దరించడానికి చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దిగ్విజయంగా సాగుతున్నది. జిల్లాల ఏర్పాటుతో పర్యవేక్షణ పెరగడంతో పనులు సాఫీగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లాలోని 1093 చెరువులు పునరిద్దరించుట కోసం ఫేజ్-1, ఫేజ్-2ల ద్వారా 448 చెరువుల పనులు రూ. 201.11 కోట్లతో ప్రారంభించి 416 చెరువుల పనులు పూర్తి చేశారు. మిగతా చెరువులు పురోగతిలో ఉన్నాయి. ఫేజ్-3లో 316 చెరువులకు గాను రూ. 86.86 కోట్లతో పరిపాలన ఆమోదం లభించింది. ఇందులో 310 అగ్రిమెంట్లు చేశారు. 38 చెరువుల పనులు పూర్తికాగా మిగతావి పురోగతిలో ఉన్నాయి. ఫేజ్-4లో 211 చెరువులను గుర్తించి ఇప్పటివరకు 211 చెరువుల ప్రతిపాదనలు పరిపాలన ఆమోదం పంపారు. 110 చెరువులకు రూ. 201.4 కోట్లతో పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. 10 చెక్‌డ్యాముల నిర్మాణం పనులు రూ. 12.49 కోట్లతో పురోగతి సాధించారు. పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వ, బునాది గాని కాలువల వెడల్పు, పునరుద్దరణ కోసం రూ. 284.85 కోట్లతో పరిపాలన ఆమోదం లభించగా పనులు పురోగతిలో ఉన్నాయి.
ఆలేరు, భువనగిరిల బీడు భూములకు మహర్థశ చేకూర్చనున్న గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు
గోదావరి జలాలను సముద్ర మట్టానికి అయిదారు వందల మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి తెలంగాణ ప్రజల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు నిర్మాణమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మానవ నిర్మిత అద్భుతం. ఇందులో భాగంగా జిల్లాలోని కరువు ప్రాంతాలలో ప్యాకేజీ 15, 16ల కింద గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 2, 12, 971 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన భూసేకరణలో ఆనకట్టలు, ప్రధాన కాల్వల నిర్మాణం కోసం ఇప్పటివరకు సుమారు 1, 275 ఎకరాల భూమిని సేకరించారు. ఇందుకు గాను నష్టపరిహారం కింద రూ. 51.03 కోట్లను రైతులకు చెల్లించారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వ త్రవ్వకం పనులు చురుకుగా సాగుతున్నాయి. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలోని మొత్తం 545 నివాస ప్రాంతాలలో మెయిన్ గ్రిడ్ సగర్వంగా పూర్తయింది. ఇందుకోసం మిషన్ భగీరథ నుంచి రూ. 1007 కోట్లు మంజూరయ్యాయి.
రాయగిరి వద్ద కలెక్టరేట్
జిల్లా పరిపాలన కోసం కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం ఖరారు చేశారు. భువనగిరి రాయగిరి మధ్యన గల పట్టు పరిశ్రమకు చెందిన 12 ఎకరాల స్థలాన్ని కలెక్టరేట్ నిర్మాణానికి అనువైన స్థలంగా గుర్తించారు. రాష్ట్రమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కొత్త కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అభివృద్ధి పథంలో వైద్యరంగం : డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, భువనగిరి పార్లమెంటు సభ్యులు
జిల్లా ఏర్పాటు తర్వాత విద్యా, వైద్యంలో పురోగతి సాధించాం. సీఎం కేసీఆర్ చేసిన కొత్త జిల్లాలతో ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చింది. ప్రజల అవసరాలు తీర్చగలుగుతున్నాం. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఎయిమ్స్ సాధించుకున్నాం. నిమ్స్‌లో ఓపీ ప్రారంభించుకుని మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. ఎంఎంటీస్‌ను రాయగిరి వరకు సాధించుకున్నాం. పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో వంట గదులు, మూత్రశాలలు, శ్మశాన వాటికలు నిర్మించుకున్నాం.

జిల్లాలో పనిచేయడం మరచిపోలేను : అనితారామచంద్రన్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు కొలువుదీరిన జిల్లాలో రెండేళ్లు పనిచేయడం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తోంది. రెండేళ్ల పాలన సంతృప్తికరంగా కొనసాగింది. జిల్లా ప్రజలు ఎంతో మంచి మనసు్స ఉన్నవారు. నాయకులు, మేధావులు, మీడియా సహకారంతో ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయగలిగాం. మరింత స్పూర్తిగా జిల్లా అభివృద్ధికి పాటుపడుతాం. జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.