యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. యాదరుషి తపస్సుకు మెచ్చిన శ్రీలక్ష్మీనరసింహుడు మొదట ఉగ్ర, జ్వాలా, గండ భేరుండ, యోగానంద, శ్రీలక్మీనరసింహుడిగా ఐదు రూపాలలో వెలిసినందున పంచనారసింహ క్షేత్రంగా పేరుగాంచింది. ఉగ్రరూపాన్ని తిలకించాలన్న యాదుని పట్టుదలకు ప్రతిరూపంగా యాదాద్రి మహాక్షేత్రం నిలిచింది. కొలిచే వారికి కొంగు బంగారంగా, ఆపద మొక్కులవాడిగా శ్రీలక్ష్మీనరసింహుడికి పేరుంది. ఏళ్ల తరబడి నయం కాని రోగాలు కేవలం శ్రీవారి దర్శనంతో మటుమాయమవుతాయని భక్తులు నమ్ముతారు. కొండపై మూడు రాత్రులు నిద్రచేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని విశ్వసిస్తారు.
నాడు భక్తోత్సవాలు….నేడు బ్రహ్మోత్సవాలు
యాదాద్రి చరిత్ర గమనిస్తే…కాలానుగుణంగా వచ్చే మార్పులతో పాటు శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు కూడా మార్పు చెందుతూ వస్తున్నాయి. జనసందోహం బహుస్వల్పంగా ఉన్న పూర్వకాలంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే ఉత్సవాలను నిర్వహించేవారు. కచ్చితంగా అందుతున్న ఆధారాల ప్రకారం యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 110 సంవత్సరాలు కావస్తున్నట్లు సమాచారం. మార్గశిర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు శాస్త్రీయ రీతికి అనుగుణంగా లేవని, అవి అశాస్త్రీయమని, వాటిని 1964 నుంచి పాల్గుణ మాసంలో జరుపుతున్నారు. శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలను గతంలో నాలుగు రోజుల పాటు నిర్వహించేవారు. 1964 వరకు శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరిగేవి.
యాతాల బస్వయ్యతో అభివృద్ధికి శ్రీకారం
శ్రీలక్ష్మీనరసింహుడి పరమ భక్తుడు, ఆలయ అభివృద్ధే ధ్యేయంగా శైవుడైన రాయగిరి గ్రామానికి చెందిన బస్వయ్య మొట్టమొదట కార్యనిర్వహణాధికారిగా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టి ఒక క్రమపద్ధతిలో ఆలయ ఉత్సవాలను నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. నేడు రెండో తిరుపతిగా యాదాద్రి క్షేత్రం అభివృద్ధి చెందడానికి బస్వయ్య చేపట్టిన అనేక కార్యక్రమాలు దోహదపడ్డాయి. భక్తులు విరాళాలిచ్చి ఉత్సవాలు జరిపే పరిస్థితి నుంచి నేడు ఆలయం ఏడాదికి రూ. 80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరడానికి, ఆ తరువాత కాలంలో జరుపుతూ వచ్చిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడ్డాయి. 1964కు ముందు భక్తులు విరాళాలిచ్చి ఉత్సవాలు నిర్వహించేవారు. వాటిని భక్తోత్సవాలుగా పిలుచుకునేవారు. కాలక్రమేణా 1964 నుంచి దేవస్థానమే ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తుంది. వీటికి బ్రహ్మోత్సవాలు నామకరణం చేశారు. శ్రీమహావిష్ణువు దాల్చిన పది అవతారాలను దశావతారాలుగా పేర్కొంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆ దశావతారాలలో ప్రధానమైన జగన్మోహిని, తిరువెంకటపతి, రామావతరం, శ్రీకృష్ణుడు, వటపత్రశాయి అలంకారాలలో శ్రీవారు తన ఇష్టమైన గరుఢ, శేష, సింహ, పొన్న వాహన, అశ్వవాహనాలలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఉత్సవాలలో భక్తులను ఎక్కువగా అలరించే ఎదుర్కోలు మహోత్సవం, తిరు కల్యాణమహోత్సవం, రథోత్సవం జరిగే రోజుల్లో యాదాద్రికొండ అపర వైకుంఠంగా దర్శనమిస్తుంది.