Site icon Sri Yadadri Vaibhavam

ర‌థోత్సవంలో భ‌క్తుల ఆనంద‌హేల‌

యాదాద్రిలో క‌నుల‌పండువ‌గా శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారి ర‌థోత్స‌వం

అంగ‌రంగ వైభవంగా జ‌రిగే యాదాద్రీశుడి దివ్య విమాన ర‌థోత్స‌వం భ‌క్తుల‌ను ఆనంద ప‌ర‌వ‌శుల‌ను చేస్తుంది. వివాహ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత అమ్మ‌వారితో క‌లిసి శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహుడు ర‌థంపై ఊరేగుతారు. ఈ ర‌థోత్స‌వాన్ని బ‌రాత్ అని కూడా పిలుచుకుంటారు. ఈ ర‌థ‌సేవ వైభ‌వంగా జ‌రుగుతుంది. రంగు రంగుల పుష్పాలు, క‌నులు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంక‌ర‌ణ‌ల‌తో దేదీప్య‌మానంగా వెలిగిపోతుండ‌గా ర‌థంపై కొలువుదీరిన శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు పోటెత్తుతారు. యాదాద్రికొండంతా భ‌క్త‌జ‌నంతో నిండిపోతుంది. ర‌థ‌స్థం మాధ‌వం దృష్ట్యా పున‌ర్జ‌న్మన విద్య‌తే అని పురాణ పురుషుల ఉవాచ‌. అంటే ర‌థంలో శ్రీ‌వారు ఊరేగుతున్నదృశ్యాన్ని క‌నులారా గాంచితే పున‌ర్జ‌న్మ ఉండ‌ద‌ని అర్థం. స్వామివారి ర‌థాన్ని లాగేందుకు భ‌క్తులు పోటిప‌డుతారు. శ్రీ‌వారికి సేవ‌లు చేయ‌డం ద్వారా త‌మ కోరిక‌లు నెర‌వేరి త‌మ‌కు ముక్తి ప్రాప్తిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. స్వామివారు అమ్మ‌వారితో క‌లిసి ఊరేగుతున్న‌ప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాడ‌ని, అందువ‌ల్ల కోరిన కోరిక‌లు తీర్చుతాడ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. వెండి గ‌రుఢసేవ‌పై శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహస్వామి అలంకారంలో అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు ర‌థం క‌ద‌ల‌డం మొద‌లై తెల్ల‌వారుజాము 2 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. తూర్పు రాజ‌గోపురం చేరేస‌రికి భ‌క్తులు ఆనందంతో త‌న్మ‌యుల‌వుతారు. సాక్షాత్తు ఆ శ్రీ‌మ‌హావిష్ణువే వైకుంఠం నుంచి త‌మ‌ని క‌రుణించ‌డానికి యాదాద్రికి దిగొచ్చాడ‌న్న ఆనందంతో భ‌క్తులు ర‌థంలో కొలువుదీరిన స్వామికి పూజ‌లు చేస్తారు.

శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహుని ర‌థోత్స‌వంలో పాల్గొన్నభ‌క్త‌జ‌నం

ఆల‌య నిధుల‌తో సంస్కృత విద్యాపీఠం

యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం త‌న సొంత నిధుల‌తో సంస్కృత విద్యాపీఠాన్ని నిర్వ‌హిస్తోంది. 58 ఏళ్లుగా యాదాద్రికొండ‌పై దీన్ని నిర్వ‌హిస్తున్నారు. 1952లో అప్ప‌టి ప్రైవేటు యాజ‌మాన్యం మందముల న‌ర‌సింహ‌రావు, కోదాటి నారాయ‌ణ‌రావు, రాజా పన్నులాల్‌ప‌ఠి, శ్రీ‌రాంద‌యాళ్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ సంస్కృత విద్యాపీఠం నెల‌కొల్పారు. ఈ సంస్థ‌ను ఆనాటి శాస‌న స‌భాధ్య‌క్షుడైన కాశీనాథ్ వైద్య ప్రారంభించారు. 20 మంది విద్యార్థుల‌తో ప్రారంభ‌మైన పీఠం ద్వారా ఎంద‌రో విద్యావంతుల‌య్యారు. 1952లోనే ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం అనుబంధ సంస్థ‌గా గుర్తింపు పొందింది. డిగ్రీ స్థాయిలో ఈ పీఠం కొన‌సాగుతోంది. ప్రాథ‌మిక స్థాయి నుంచి డిగ్రీ వ‌ర‌కు ఉచిత విద్య బోధించ‌డంతో పాటు భోజ‌నం, వ‌స‌తిని కూడా ఏర్పాటు చేశారు. క‌ళాశాల ప్రిన్సిపాల్‌గా ద‌రూరి రామానుజాచార్యులు కొన‌సాగుతున్నారు.

Exit mobile version