శ్రీయాదాద్రి ప్రతినిధి :
శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఉంది. ఈ క్షేత్రం వలిగొండ – తొర్రూరు రహదారిపై వలిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో, హైద్రాబాద్ – వరంగల్ జాతీయ రహదారికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ రహదారికి ఆనుకొని క్షేత్రములోనికి వెళ్ళుటకు గాను స్వాగత ముఖద్వారం ఏర్పాటు చేయనైనది. ఈ ముఖద్వారము నుండి గట్టుపైకి నూతనంగా రోడ్డు మార్గము ఏర్పాటు చేయనైనది. ఈ క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాలలో ఒకటిగా విరాజల్లుతున్నది. శ్రీ స్వామివారు గట్టుపైన (కొండపైన) కొలువైయున్నాడు. మత్స్యం అనగా చేప, ఈ గుట్ట మత్స్య (చేప) ఆకారంలో ఉండటం చేత ఈ క్షేత్రం మత్స్యగిరి క్షేత్రముగా ప్రసిద్ధి గాంచినది.
కొలనులో మత్స్యావతారంగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహుడు
కొన్ని వేల సంవత్సరాల క్రితం రుషుల జనసంచారం లేని నిర్మలమైన ప్రదేశం కొరకు అన్వేషిస్తూ ఈ కొండపైకి చేరుకున్నారు. మాలరూపంలో సాలగ్రామరూపంలో ఉన్న కొండను చూసి తపస్సు చేసుకొనుటకు అనుకూలంగా ఉన్నదని భావించి తపస్సు ప్రారంభించారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని దుష్టశక్తులు తపోభంగము చేయుటకు నిర్ణయించి వారి తపస్సుకు విఘాతం కలిగించిరి. వారు సర్వశక్తులు ఉపయోగించి శ్రీ స్వామి వారిని ప్రార్థించిరి. వారి తపస్సు శక్తికి మెచ్చి పెద్ద రూపముగా స్వయంభూవై వెలసిన స్వామి పాదాల నుండి పవిత్రమైన జలం ప్రవాహిస్తూ గుండములు నిండిపోయెను. అది చూసి సంతోషించిన మునులు క్షేత్రపాలకునిగా ఆంజనేయనేయస్వామిని ప్రతిష్టించుకొని స్వామి పూజలు ప్రారంభించిరి. అభిషేక పూజ తీర్థమునకై మునులు కొలనులోకి వెళ్ళగా శ్రీ స్వామి వారు నామరూపుడై మత్స్యావతారంగా దర్శనమిచ్చెను. దశావతారములలో ఒకటైన మత్స్యావతారము నామరూపముగా కొలనులో వెలసి మత్స్యగిరిగా పేరుగాంచెను. వేల తీరులలో స్వామి వారిని కొలిచిన మునులు గల కొండ కనుక ఇది వేములకొండగా ప్రసిద్ధిగాంచినది.
కోనేరులో చేపల తలమీద విష్ణునామాలు
గట్టుపైన శ్రీ స్వామి వారి ఆలయం ఎదురుగా పెద్ద కోనేరు కలదు. ఈ కోనేరు ప్రాముఖ్యత ఈ కోనేరులోని చేపలు అత్యంత విశేషమైనవి. కోనేరులో గల చేపల తలమీద విష్ణునామాలు కలవు. విష్ణు నామాలు గల చేపలు ఈ దేవాలయంలో తప్ప మరెక్కడా ఉన్నట్టు తెలియరాలేదు. ఈ కోనేరు మూడు గండములు కలిసి ఒక కోనేరుగా వెలిసింది. ఈ గుండానికి మరొక నామము నామాల గుండం (కోనేరు). ఈ మూడు గుండముల గురించి ప్రధానంగా ఒకటి నామాల గుండము. రెండొవది విష్ణు గుండము, మూడవది మాల గుండంగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుండములోని నీటిని భక్తులు తీర్థముగా స్వీకరించి, వారి ఆరోగ్యములు కుదుటపడుట కోసం, వారి పంట పొలములపై చల్లడం కోసం తీసుకెళుతుంటారు.