వేములకొండపైన గల కోనేరులో స్నానమాచరిస్తున్న భక్తులు
శ్రీయాదాద్రి ప్రతినిధి :
అభయ వృక్షము
శ్రీ స్వామి వారి సన్నిధిలో క్షేత్రపాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ముందు భాగంలో పుష్కరిణికి, శ్రీ స్వామి వారి ఆలయానికి మధ్యలో ఒక రావి చెట్టు కలదు. సంతానం లేని వారు స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేసి కొబ్బరికాయను స్వామి వారి పాదాల చెంత పూజ చేయించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి తదుపరి సూర్య నమస్కారాలు చేసి వారి మనసులోని కోరికను విన్నవించుకొని ముడుపు కట్టడం వల్ల స్వామి వారి అనుగ్రహం వారి కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
సీతారామచంద్రస్వామి దేవస్థానము
శ్రీ స్వామి వారి గట్టు దిగువ భాగంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం నిర్మాణం చేశారు. మత్య్సగిరి దేవాలయానికి వచ్చే భక్తులు ఇంటికి వెళ్లే క్రమంలో శ్రీరాముని సన్నిధికి వెళ్లి దర్శించుకుని వారు కోరిన కోరికలు నెరవేరాలని విన్నవించుకొని వెళ్లడం ఆనవాయితి. 2015 నుంచి సీతారామచంద్రస్వామిని దర్శించుకునే అవకాశం కూడా కల్పించారు. 2015 నవంబర్‌లో శ్రీరాముని సన్నిధిని ఏర్పాటు చేయడంతో శ్రీరాముని భక్తులు కొండకు తరలివస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి వారి పర్యవేక్షణలో సీతారామచంద్రస్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.
బ్రహ్మోత్సములు
మత్స్యగిరి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జేష్ఠ్య శుద్ధ త్రయోదశి నుండి బహుళ విదియ వరకు ఐదు రోజులు అత్యంత వైభవంగా జరుపుతారు. శ్రీ స్వామి వారికి అనుబంధ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం దనుర్మాసం నెలరోజులు మార్గళి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.