శ్రీ యాదాద్రీశుడి కల్యాణం… మన లక్ష్మీనరసింహుడి శుభలగ్నం అని 33 కోట్ల దేవతలు, లక్షలాది మంది భక్తులు వీక్షిస్తుండగా యాదాద్రికొండపై తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. తెలంగాణ తిరుపతిగా రాష్ట్రమంతటా వాసికెక్కిన శ్రీలక్ష్మీనరసింహుడు శ్రీలక్ష్మీ అమ్మవారితో లోక కల్యాణార్థం జరుపుకునే వివాహ వైభవం భక్తులకు కొంగు బంగారం కానుంది. లోకాలను రక్షించడమే దీక్షగా మాంగళ్యమనే తంతు సాక్షిగా శ్రీవారు, దేవేరు ఒక్కటయ్యే వేళలో శ్రీలక్ష్మీనరసింహుడి తిరు కల్యాణమహోత్సవం యాదాద్రికొండపై వైభవంగా జరగనుంది. బాజాభజంత్రీలు.. భేరీ నినాదాల నడుమ జై నారసింహ అంటూ భక్తులు జయ జయ ద్వానాలు చేస్తుండగా, అమ్మవారి, స్వామి వారి సేవలు పశ్చిమ గోపురం నుంచి కదులుతాయి. రుత్వికులు మనసు నిండా శ్రీవారిని కొలుస్తూ ముందుకు సాగుతుంటారు. ఇంద్రాది దేవతలు తరలిరావాలని శ్రీవారి వాహనమైన గరుడ పక్షి ద్వారా దేవ భాషలో ఆహ్వానాలు పంపించి దేవ పండితులు కోట్లాది దేవతల కనుసన్నల్లో జరిగే మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అర్థరాత్రి సమయంలో అమ్మవారిని వివాహమాడే ఘడియలు ఎంతో పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. కనులకు ఇంపుగా ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణమండపాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. మాంగళ్యం తంతునానే లోక రక్షణ హేతునా…కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం అంటూ వేద పండితులు, యాజ్ఞీకులు, రుత్వికులు పఠిస్తుండగా అమ్మవారికి జరిగే మాంగళ్యధారణను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. లోక రక్షకుడైన శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వ ధర్మాలకు మూలమైన శ్రీలక్ష్మీనరసింహుడు పాప సంహారానికి, భక్తుల రక్షణకు ముందుంటాడని ఎన్నో ఘటనలు నిరూపించాయి. శరణాగత వత్సలుడగు నారసింహుడితో శరణాగతి పొంది నీవే రక్షకుడవని విశ్వసించిన కోట్లాది మంది ప్రజలకు ఎంతో జాగరూకుడై ఉంటాడని యాదాద్రి క్షేత్రమహత్యం వివరిస్తుంది. శ్రీవారి కోసం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంలో బ్రహ్మోత్సవాలను, విశేష ఉత్సవములను, నిర్మాణమును కట్టుబాట్లను అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తారు.

టీవీలతో కనువిందు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులకు దగ్గరగా అన్ని పక్కల వారికి కనువిందు చేసేందుకు వీలుగా ఎక్కడిక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనానికి శ్రీవారి కల్యాణ మహోత్సవం కనిపించేందుకు సీసీటీవీలు ఉపయోగపడుతున్నాయి. కల్యాణం రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. వేదపండితులు వివాహాన్ని జరిపిస్తారు. రెండు చోట్ల 16 ఎంఎం స్క్రీన్లను ఏర్పాటు చేసి కల్యాణ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దూరదర్శన్, సప్తగిరి చానల్, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌లోనూ ప్రత్యక్ష ప్రసాదం జరుగుతుంది. మండపం వద్ద భక్తులు కూర్చునేందుకు వీలుగా స్థలాన్ని శుభ్రం చేసి తగు ఏర్పాట్లు చేపట్టారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్యాలరీ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి భక్తులకు సదుపాయాలను కల్పించే చర్యలకు శ్రీకారం చుట్టారు. కల్యాణం ముగిసిన తర్వాత దేవుడి ప్రసాదాలను భక్తులకు అందిస్తారు.