గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు
శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించిన అర్చకులు
శ్రీయాదాద్రి ప్రతినిధి : యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా గురువారం వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణ చేసి తన భక్తిని చాటుకున్నారు. యాదాద్రికొండ చుట్టూ సాగు గిరిప్రదక్షిణలో భక్తులు స్వామి వారిని స్తుతించే పాటలు పాడుకుంటూ.. భజనలు చేస్తూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు గుంపుగా భజనలు చేస్తూ ప్రదక్షిణ చేశారు. కొండపైన స్వాతి సందర్భంగా శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో కైంకర్యాలను నిర్వహించారు. ఆలయంలో నిత్యపూజలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా శ్రీవారి ఖజానాకు రూ. 8, 27, 095 ఆదాయం సమకూరింది.