శ్రీయాదాద్రి ప్రతినిధి : 250 విస్తీర్ణంలో ప్రకృతి ఒడిలో టెంపుల్‌సిటీ పెద్దగుట్టపైన నిర్మాణమవుతున్నది. టెంపుల్‌సిటీని 250 ఎకరాలలో నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు పూర్తి కాగా ఇవి సరిపోవంటూ టెంపుల్‌సిటీల కోసం మరో 850 ఎకరాలలో ప్రణాళికలు తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా సర్వే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న పెద్దగుట్టపైన 250 ఎకరాల ప్రక్కనే, మరో 1000 ఎకరాలకు వరకు ప్రణాళికలను విస్తరించేందుకు అవసరమైన భూమి ఉందనే నివేదికలు సీఎంకు చేరాయి. మొదటి దశలో చేపట్టాలనుకున్న 250 ఎకరాల విస్తీర్ణంలోని పనుల నమూనాలు ఖరారు కావడంతో ఇక నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. 86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పుడ్‌కోర్టులు, ఏడు ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, పన్నెండు ఎకరాలలో గ్రీనరీ, 62 ఎకరాలలో రహదారులు, 26 ఎకరాలలో ల్యాండ్ స్కేపింగ్ చేయడంతో పాటు మరో 42 ఎకరాల ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు 2200 ఎకరాల భూములను వైటీడీఏ సేకరించింది.
రాజధాని ఔటర్‌రింగ్ రోడ్డు కన్నా పెద్దరోడ్లు
హైద్రాబాద్ చుట్టూ ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు కన్నా పెద్దవైన రోడ్లు టెంపుల్‌సిటీలో నిర్మాణమయ్యాయి. మొత్తం కొండపైన 20 రోడ్లను నిర్మించారు. రూ. 202 కోట్ల వ్యయంతో టెంపుల్‌సిటీ లే అవుట్ రూపుదిద్దుకోనున్నది. ఏడు ఎకరాల రోడ్లు నిర్మాణమయ్యాయి. 101.5 మీటర్లు, 47.2 మీటర్లు, 44.4 మీటర్లు, 42.3 మీటర్లు, 45.7 మీటర్లు, 21.3 మీటర్లు, 12 మీటర్ల రోడ్లుగా విభజన చేశారు. దీనికి తోడు గిరిప్రదక్షిణ రోడ్డును 200 మీటర్లలో నిర్మాణం చేస్తున్నారు. రాయగిరి నుంచి రూ. 110 కోట్లతో యాదాద్రి వరకు నాలుగు వరుసల రోడ్డునుఆకర్షణీయంగా నిర్మాణం చేశారు. యాదాద్రికి నాలుగు దిక్కుల కూడా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. యాదాద్రి – చేర్యాల, యాదాద్రి – వంగపల్లి, యాదాద్రి కీసర రోడ్లు నాలుగు వరుసలుగా మారుతున్నాయి.