శ్రీయాదాద్రి ప్రతినిధి :
ప‌్రపంచంలో ఏకశిల ఖిల్లాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన భువనగిరి ఖిల్లా.. దశాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. రాజులు పోయారు.. రాజ్యాలు పోయారు..కానీ నాటి సుదీర్ఘ జ్ఞాపకాలను మాత్రం సాక్షీభూతంగా మిగిల్చుకుంది. నాటి చరిత్రను కాపాడి మన ముందు తరాలకు అందించాల్సిన గత పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పర్యాటక కేంద్రంగా మారాల్సిన ఖిల్లా మరుగున పడింది. తూర్పు చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు ఏకశిల కొండపై నిర్మించిన భువనగిరి ఖిల్లా చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది. కోట సందర్శనకు రాజధాని నగరం నుంచి విశేష సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఏకశిల కావడంతో భువనగిరి ఫోర్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించింది.భువనగిరి ఖిల్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాక్‌క్లైంబింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం ఇక్కడి విద్యార్థులు అన్నపూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరంను అధిరోహించడంతో ఖిల్లా మారుమ్రోగింది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఎవరెస్టును అధిరోహించడంతో శిక్షణ పొందే విద్యార్ధుల సంఖ్య కూడా పెరిగింది. విదేశీ టూరిస్టులు ఇప్పుడు విశేషంగా సందర్శిస్తున్నారు.