శ్రీమహావిష్ణువు పాదాలను బ్రహ్మదేవుడు కడుగగా ఏర్పడినదే విష్ణుపుష్కరిణి అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. పంచనారసింహ క్షేత్రమైన ఈ ఆలయాన్ని గురించి స్కంద, బ్రహ్మాండ పురాణాలలో చంద్రవంశపు రాజు సహస్ర నాయకుడగు భృగుమహర్షి ఇక్కడి నారసింహ మంత్రానుష్టాన విధానాన్ని, ఆలయ నిర్మాణ క్రమాన్ని, ఫలాన్ని వివరించినట్లు ఈ పురాణాలలో పేర్కొన్నారు. హిరణ్యకశ్యపుడి వధ అనంతరం…దేవతలు, రుషులు వైకుంఠనాథుడైన శ్రీమహావిష్ణువు ఎల్లవేళలా దర్శనం చేసుకోవడానికి అవకాశమివ్వాల్సిందిగా వేడుకుంటారు. దాంతో రాక్షసవధ జరిగిన చోట ప్రసన్నంగా దర్శనం కావడం భావ్యం కాదని, దక్షిణాపధాన గల ఈ కొండ గుహాలో లక్ష్మీసమేతంగా వెలిసి యోగ, జ్ఞాననేత్రాలకు దర్శనమివ్వగలనని వారికి ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ వెలిసినట్లు చెబుతారు. ఆ ఆనందంతో దేవతలు, రుషులు, సృష్టికర్త బ్రహ్మ శ్రీవారి పాదాలను కడిగిన తరువాత ఏర్పడినదే పుష్కరిణి.
పుష్కరిణిలో స్నానం…మహాపుణ్యం
పుష్కరిణిలో స్నానం సకల శుభప్రదం. 40 దినాలు శ్రీవారికి ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగాలు నయమవుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థం సన్నిధిలో పితృకార్యాలు జరిపితే పితృదేవతలు తరించి వైకుంఠవాసులై సుభిస్తారని, వ్రత క్రతువులు చేసినచో అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుపుష్కరిణిలో స్నానమాచరిస్తే సమస్త పుణ్యక్షేత్రాల్లోని తీర్థములందు స్నానం చేసినంత ఫలం వస్తుందట. బ్రహ్మోత్సవాలు జరిగే రాత్రులందు ఈ తీర్థానికి మధ్య అఖండ దివ్యమైన దివ్యజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ జ్యోతిని సావిత్రి – గాయత్రి – అరుణ దేవతలుగా ఆరాధిస్తారు. ఈ జ్యోతి ప్రకాశం నుంచి సుదర్శన జ్యోతి వెలుగొంది సమస్తమైన దీర్ఘకాలమైన వ్యాధుల నుంచి భక్తులను విముక్తి చేస్తుందని విశ్వాసం.
పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామి ఆలయం
బ్రహ్మాది దేవతలు విష్ణువు పాదాలు కడగడంతో ఉద్భవించిన యాదాద్రి పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామి వారి ఆలయం భక్తులకు కొంగుబంగారమైంది. ప్రతినిత్యం ఆంజనేయస్వామికి పూజలు జరుగుతాయి. పుష్కరిణి ఆంజనేయస్వామిగా భక్తులు మొక్కు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణల మొక్కుతో ఈతి బాధలు తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే భక్తులు సంకల్ప పూజలు చేస్తారు.
శ్రీవారి జన్మతిథి స్వాతి
శ్రీలక్ష్మీనరసింహుడు సాయం సంధ్యవేళ స్వాతి జన్మనక్షత్రంలో స్తంభోద్భవుడైనాడు. దుష్టశిక్షణ, ధర్మరక్షణ చేసి…తననెప్పుడూ పిలువకపోయినా అండగా ఉండి కాపాడుతానని నృసింహ అవతారం ద్వారా శ్రీమహావిష్ణువు తన భక్తులకు నిరూపించాడు. స్వాతి నక్షత్రంలో శనివారం మాఘ, పాల్గుణ, వైశాఖ, శ్రావణమాసాలు మహామహిమాన్విత పవిత్ర దినాలుగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ చేసే దానం ఏదైనా అనంతకోటి ఫలదాయకమైన అక్షయ సౌఖ్యాలను సమకూర్చుతుందని నమ్మకం.