అదిగో భోనగిరి….అదిగదిగో రాయగిరి…ఆ రెండింటినీ తలదన్నేలా కనిపిస్తున్నది సూడు అదే యాదాద్రి….యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం…తెలంగాణ ఇలవేల్పు యాదాద్రీశుడు పంచారుపాల్లో దర్సనమిస్తున్నాడు. కొలిచిన వారికీ కొంగు బంగారమై వేలుగొందున్నాడు. యాదాద్రీశుడికి పూజలు జరిపితే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. రాష్ట్ర రాజధానికి అతి చేరువలో గల యాదాద్రి క్షేత్రం…కొలిచిన వారికీ కొంగు బంగారమై విరాజిల్లుతోంది.
రుషి ఆరాధనా క్షేత్రం
హిరణ్యకశిపుని వధ తరువాత ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి శ్రీలక్ష్మినరసింహుడు యాదాద్రి శిఖరంపై ఉన్న విశాలమైన పర్వత గుహాలో కొలువుదీరాడు. కొంతకాలం తరువాత ఋష్యశృంగుని పుత్రుడయిన యాదరుషి ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో మహా తప్పస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన భగవానుడు శ్రీజ్వాలా నరసింహస్వామిగా, యోగానందుడిగా, శ్రీగండభేరుండగా, శ్రీలక్ష్మినరసింహుడిగా, శ్రీఉగ్రనర సింహుడిగా ఐదు రూపాల్లో అవతరించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీజ్వాలా శ్రీనరసింహస్వామి రెండు శిలాఫలకాల మధ్య దీర్ఘమైన శ్రీచూర్ణ రేఖవలె భక్తులకు దర్సనమిస్తాడు. గ్రహబాధలు, శారీరక, మానసిక ఈతి బాధలు గలవారు శ్రీవారిని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. నేటికీ మహర్షులు ఇక్కడికి అదృశ్యంగా వచ్చి శ్రీవారిని ఆరాదిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రం రుషి ఆరాధనా క్షేత్రం ప్రసిద్ధి గాంచింది.
యాదాద్రి చరిత్ర సమస్తం ఆసక్తికరం
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ చరిత్ర అంతా ఆసక్తికరం. కాకతీయ రాజవంశీయులు కూడా స్వామి వారికి పూజలు జరిపారు. ఈ ఆలయాన్ని సందర్శించి అభివృద్దికి బాటలు వేశారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో లభించిన శాసనాల్లో ఈ విషయం వెలుగు చూసింది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్సించుకున్నట్లు కొలనుపాకలో లభించిన శాసనం ద్వారా తెలుస్తున్నది. కీసరగుట్ట త్రిభువనమల్లుడు కూడా స్వామివారిని సేవించినవావాడే. 13వ శతాబ్దంలో కాకతీయులు ఒక ఆయుర్వేద వైద్యుడికి ఈ స్థలాన్ని దానమిచ్చినట్టు చెప్తున్నా, అందుకు తగిన అధారాలేవు. 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతంలోని శాసనాలను ఆర్కియాలజీ డిపార్టుమెంటు భద్రపర్చింది. ఆలయ చరిత్రను శాసనాల ద్వారా వెల్లడి చేసి ప్రచురించాల్సిన అవసరముంది. సింహాకారంలో యాదాద్రి గుట్టపైన స్వయంభువుడిగా వెలసిన నారసింహుడు ఐదు అవతారాల్లో నెలకొని ఉన్నాడు.
ఆలయాభివృద్ధిలో నవాబులు
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి వారి ఆలయ పాలనా వ్యవస్థలో నవాబులు కీలకపాత్ర పోషించారు. 1937కు పూర్వం అప్పటి నిజాం ప్రభుత్వం తహసీల్దార్ రజా అలీని తొలి కమిటి చైర్మన్ గా నియమించింది. తయ్యాల శేషాచార్యులు పూజారిగా ఉంటూ క్షేత్రాభివృద్దికి కృషి చేశారు. రజా అలీ తరువాత భువనగిరికి చెందిన రాందయాల్ యాదగిరిగుట్ట పాలన పగ్గాలు చేపట్టి పాలనను చక్కగా నిర్వహించారు. అనంతరం నిజాం ప్రభుత్వ సభాసభ్యుడిగా కొనసాగిన రాయగిరికి చెందిన రామారావు చైర్మన్ గా వ్యవహరించారు. రామారావు, శేషాచార్యులు పూజారి మధ్య ఏర్పడ్డ తగాదా హక్కు మార్పిడికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సీతారామయ్య భార్య రాధాబాయమ్మకు వంశపారంపర్య హక్కు లభించింది.
ఘాట్రోడ్డును ప్రారంభించిన పడీర్ యాజం
1940లో నిర్మించిన ఘాట్రోడ్డును ఆప్పటి పడీర్ యాజం హైదరి ప్రారంభించారు. శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ప్రవేటుగా కొనసాగిన ఈ దేవస్తానం అప్పట్లో ఈఓలుగా పనిచేసిన కొండల్ రావు, యాతాల బస్వయ్య హయాంలో అభివృద్దిపథంలో పయనించింది. 1966లో దేవాదాయ, ధర్మాదాయ చట్టం రావడంతో యాదాద్రి ఆ శాఖలో విలీనమైంది.
వాత్సాల్యానికి ప్రతీక శ్రీలక్ష్మినరసింహుడు
శ్రీలక్ష్మినరసింహుడు వాత్సాల్యానికి ప్రతీకగా నిలుస్తాడు. అత్యంత క్రూరమృగమైన సింహంగా కనిపించినప్పటికీ శాంతిని మూర్తింపజేసే వాత్సల్యం కలిగినవాడు శ్రీలక్ష్మినరసింహుడు. క్రూర మృగాల వంటి హింసాత్మకమైన మనస్తత్వం కలిగి ఉండి కూడా ప్రహ్లాదుడిని రక్షించడం ద్వారా తన కరుణారసాన్ని చాటుకున్నాడు. ప్రహ్లాదుడు అంటే బాగా ఆహ్లాదాన్ని కలిగించేవాడు. లోకాన్ని ఆనందింపజేసే వారినెప్పుడూ ప్రాపంచికమైన విషయం వాంఛలు బాధిస్తూనే ఉంటాయి. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హింసించేవాడు. మనల్ని నిత్యం వేధించే ఈ వాంఛలపై శ్రీహరి నృసింహ అవతారం ఎత్తినట్లు విరుచుకుపడబోతే వాటి సంరక్షణ జరగదు. మోహం అనే స్తంభాన్ని బద్దలు కొడితే తప్ప ఆ పరమాత్మ దర్శనం జరిగితే మనలోని రజోగుణాలు దూరమవుతాయి. శ్రీమహావిష్ణువు అవతారాల్లో నాల్గవది నృసింహ అవతారం. రామావతారం, కలియుగ అవతారమైన వేంకటేశ్వర మూర్తుల తరువాత అత్యధికంగా ప్రజలు ఆరాధించే వాత్సల్యమూర్తిగా నృసింహుడి లక్ష్మీనరసింహుడి కరవాలంబస్తోత్రంలో ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయంలోని ఎర్రన నృసింహ పురాణంలోని శ్రీలక్ష్మీనరసింహ అవతార వైభవాన్ని ఘనంగా ఆవిష్కరించాడు. నరసింహ అవతారం, సింహాది్ర నారసింహశతకం వంటి ఎన్నో రచనలు నారసింహుడిని కారుణ్యమూర్తిగా అభివర్ణించాయి. జానపద వాజ్ఞ్మయంలోనూ, యక్షగానాల్లోనూ, పారమజనులకు కూడా నృసింహుడు ఆత్మీయ మూర్తిగా దర్శనమిస్తాడు. యాదాద్రి, అహోబిలం, సింహాచలం, వేదాచలం, కనకగిరి, వెయ్యినూతుల, కంది వంటి దివ్యస్థలాల్లో వెలసిన నరసింహమూర్తి దివ్యమైన మహిమలతో అభయమిచి్చ రక్షిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఉత్సవాలు జరిగే పుణ్యదినాల్లో నరసింహస్వామి వారిని దర్శించి ప్రహ్లాద వరదా గోవిందా అని ఎలుగెత్తి వేడుకోవడం ద్వారా ఆపదలు తొలగిపోతాయని నృసింహ పురాణం తెలుపుతుంది.
శ్రీకరుడు…శుభకరుడు…శ్రీలక్ష్మీనరసింహుడు
ఆపదలో అర్తత్రాణ పారాయణుడిగా, కొలిచే వారికి కొంగు బంగారంగా ప్రసిద్దికెక్కిన యాదాద్రి పుణ్యక్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. శక్తిని, భక్తిని, ముక్తిని ప్రసాదించే పరమానంద స్వరూపుడైన శ్రీలక్ష్మీనరసింహుడు వెలసినదే యాదాద్రికొండ. నమ్మిన వారికి సకల భోగభాగ్యాలు ప్రసాదించే నారసింహుడు తెలంగాణలో ప్రతి ఇంట్లోనూ ఇలవేల్పుగా విరాజిల్లుతున్నాడు.