ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తిరుమల స్థాయిలో దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంతో పాటు భక్తుల వసతి సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడాది చివరి నాటికి ప్రధానాలయ మండపం పూర్తి చేసి…గర్భాలయంలో భక్తులకు స్వామి వారి దర్శనాలు కల్పించాలనే లక్ష్యంగా పనులను వేగవంతం చేశారు. అయితే ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండపై ప్రధాన ఆలయ మండపం, సప్తగోపురాలు, ప్రాకార మండపాల నిర్మాణాలను వేగవంతం చేశారు. ప్రధానాలయ మండప పనులను పూర్తి చేసి సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా స్వామి దర్శనాలను ప్రారంభించడానికి అన్ని విధాలుగా శ్రమిస్తున్న అధికారులు…ఆలయ దర్శనాలు ప్రారంభంతో కొండను సందర్శించే భక్తులకు వసతి సదుపాయాల కల్పన కోసం అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో ప్రధానాలయ మండల పనులతో పాటు భక్తులకు మౌళిక వసతి సదుపాయాలు కల్పించే విషయమై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తులసివనంలో రూ. 15.60 కోట్లతో 160 గదులతో భారీ నృసింహ కాంప్లెక్స్‌ను నిర్మాణం చేస్తున్నారు. భక్తుల వసతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న సంకల్పంతో 160 గదులను నిర్మాణం చేస్తున్నారు. దీంతో పాటు గోశాల వద్ద రూ. 2.65 కోట్ల వ్యయంతో ఒకేసారి 200 కుటుంబాలు బస చేసేందుకు అవసరమైన విధంగా ధర్మశాల నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించారు. భక్తుల ఆహ్లాదం కోసం చెరువుల సుందరీకరణ, గ్రీనరీ అభివృద్ధితో పాటు రహదారులను పూర్తి చేసేదిశగా వేగవంతం చేయాలని ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయించారు. యాదాద్రి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, టెంపుల్‌సిటీ అభివృద్ది ప్రణాళికలు, పనుల పురోగతిని సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె జోషి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైటీడీఏ, ఆర్ ఆండ్ బీ, ఆలయ భక్తులకు ఆధునిక వసతులతో బస చేయడానికి సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రికొండకు అభిముఖంగా గల పెద్దగుట్టపై దాదాపు 207 ఎకరాల్లో టెంపుల్‌సిటీని అభివృద్ధి చేశారు. విశాలమైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్‌తో పాటు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పార్కులు, పచ్చదనం అభివృద్ధి చేశారు. అయితే ఈ టెంపుల్‌సిటీలో ఆధునిక వసతులతో కాటేజీలు, విల్లాలు, వసతి సముదాయాల కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం దాతలను ఆహ్వానించారు. మల్టీనేషనల్ కంపెనీలు కూడా విల్లాలు, కాటేజీలు నిర్మాణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించారు. అయితే టెంపుల్ లే అవుట్ అభివృద్ధి పూర్తి చేసిన అధికారులు కాటేజ్, విల్లాల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలకు ప్లాట్ల కేటాయింపులకు సిద్ధం చేశారు. అయితే ఓ వైపు మరో మూడు నాలుగు మాసాల్లో ఆలయ పనులు పూర్తి చేసి దర్శనాలు ప్రారంభం కానున్న తరుణంలో టెంపుల్‌సిటీలో నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి భక్తుల వసతి సముదాయాలపై కూడా దృష్టి సారించాలని వైటీడీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
టెంపుల్‌సిటీలో భారీ నిర్మాణాలు…
టెంపుల్‌సిటీలో భారీ, అతి భారీ నిర్మాణాలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. రూ. 75 లక్షలు, రూ. కోటి, రూ. 2 కోట్ల విరాళాలు ఇచ్చే భక్తుల కొసం నిర్మాణాలు చేపట్టనున్నారు. టెంపుల్‌సిటీలో 304 ప్లాట్లను నిర్మాణాల కోసం సిద్ధం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు వర్తించే విధివిధానాలను ఖరారు చేస్తూ వైటీడీఏ నిర్ణయం తీసుకున్నది. దీనిప్రకారం దేవస్ధానం వారు నిర్దేశించిన డిజైన్ల ప్రకారం నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది. అంతేగాకుండా వైటీడీఏ సంబంధించిన ఇంజనీర్ల పర్యవేక్షణలోనే నిర్మాణాలు జరుగుతాయి. కాటేజీల నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలకు ఏడాదిలో ఎన్ని రోజులు ఉచితంగా కేటాయించాలనేది త్వరలో ప్రకటించనున్నారు. ముందుగా విల్లాలు, కాటేజీల నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.

చెరువుల సుందరీకరణ
హైద్రాబాద్ నగరానికి సమీపంలోని యాదాద్రి ఆలయాన్ని సందర్శించే భక్తులకు స్వామి వారి దర్శనంతో …ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం కలిగించేందుకు సమీప చెరువులను సుందరీకరించాలని నిర్ణయించారు. వైటీడీఏ పరిధిలోని రాయగిరి, గండి చెరువుల, మల్లాపురం చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఐబీ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులను చేపట్టారు. అయితే రాయగిరి చెరువుకట్ట విశాలం, పచ్చదనంతో పాటు భక్తులు సేదతీరడానికి సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా యాదాద్రికొండ దిగువనే గల గండిచెరువు కట్టను పటిష్టం చేసిన అధికారులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనులు జరగనున్నాయి. వీటితో పాటు కొండచుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేయడానికి గిరి ప్రదక్షిణ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. భువనగిరి-యాదాద్రి రహదారిపై రాయగిరి వద్ద నిర్మాణంలోని ఆర్ఓబీ పనులతో పాటు గ్రీనరీ, తాగునీరు, డ్రైనేజీ పనులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయడానికి అధికారులు దృష్టిసారిస్తున్నారు.
నారసింహుడి సన్నిధిలో వేదపాఠశాలకు ప్రతిపాదనలు
చారిత్రకంగా, పౌరాణికంగా ఎంతో ప్రసిద్ధమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఆధ్యాత్మికత వెల్లివిరియడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. స్వామి వారి సన్నిధిలో ఆగమశాస్త్ర రీతిలో పూజా కైంకర్యాలతో పాటు ఆగమ, వేద శాస్త్రాల్లో నిష్టాతులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా వేదపాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వేదపాఠశాలకు అవసరమైన పూర్తిస్ధాయి వసతి, సదుపాయాలతో పక్కా పాఠశాల భవన నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలిస్తున్నారు. యాదాద్రి ఆలయ సన్నిధిలో వేదపాఠశాల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదానికి నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే జోషి వైటీడీఏ, ఆర్ ఆండ్ బీ, ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.