ముగింపు దశకు చేరుకున్న యాదాద్రి ప్రధానాలయ పనులు
2019 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్శనాలు ప్రారంభం
శ్రీయాదాద్రి ప్రతినిధి : వెయ్యేళ్ల కాలపరిమితి… కాకతీయ శైలిని ప్రతిబింబించే నిర్మాణ శైలి… తిరుమలకు ధీటుగా నిర్మాణాలు… కృష్ణశిలలతో ఆకట్టుకుంటున్న నిర్మాణాలు యాదాద్రిలో కనువిందు చేస్తున్నాయి. ప్రధానాలయ నిర్మాణం పనులు పూర్తి కావొస్తున్నాయి. బ్రహ్మోత్సవం మండపంతో కలిపి ప్రధానాలయ నిర్మాణం 4.35 ఎకరాల్లో జరుగుతుంది. 2019 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈఓ ఎన్.గీత, ఆర్కిటెక్టు ఆనందసాయి, స్తపతులు ఎస్.సుందరరాజన్, డాక్టర్ ఆనందాచార్యుల వేలులు కొండపైన జరుగుతున్నవిస్తరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానాలయంలోకి భక్తులు ఎలా ప్రవేశిస్తారు మొదలుకుని దర్శనాల ప్రక్రియ ఎలా జరుగుతుంది. ముఖమండపంలో భక్తులకు కనువిందు చేయనున్న 32 నరసింహ అవతారాలు, ప్రహ్లాదుని చరిత్రను తెలిపే ఘట్టాలు శిల్పాకృతిలో దర్శనమివ్వనున్నాయి. తూర్పున నిర్మాణం చేసిన పంచతల గోపురం నుంచి భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈశాన్యంలో గల త్రితల గోపురం నుంచి శ్రీ ఆంజనేయస్వామి వారిని, గంఢభేరుండ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ముఖమండపంలో ఏర్పాటు చేసిన ఆళ్వార్లను చూసి తరిస్తూ భక్తులు ముందుకు సాగుతారు. అటు నుంచి ఉపాలయాలలో గల ఆండాళ్ అమ్మవారు, రామానుజ స్వామిని దర్శించుకుంటారు. 8 ఫీట్ల వెడల్పులో ఏర్పాటు చేస్తున్న క్యూలైన్ ద్వారా గర్భాలయంలోని గుహలో కొలువుదీరిన పంచనారసింహుడిని దర్వించుకుంటారు. అటు నుంచి పశ్చిమగోపురం ద్వారా ఆలయం వెలుపలికి చేరుకుని ప్రాకారాలకు గల శిల్ప సంపదను వీక్షిస్తూ శివాలయం వైపుకు అడుగులు వేస్తారు. ప్రాకారంలో ఈశాన్యదిశలో నిత్యమండపం నిర్మాణమవుతుంది. ధ్వజస్తంభం 36 అడుగుల్లో ఏర్పాటవుతుంది. ముఖమండపం నుంచి పశ్చిమగోపురం ద్వారం చేరుకోవడానికి 36 మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. వృద్దులు, వికలాంగుల కోసం లిప్టు సౌకర్యం కూడా ఉంటుంది. శ్రీవారికి మూడు పూటలా జరిగే ఆరగింపు, భోగములు సమర్పించేందుకు రామానుజ కూటమి నుంచి నేరుగా ముఖమండపం వెనుక భాగంలోకి చేరడానికి అర్చకుల గది వరకు లిప్టు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దివ్యవిమాన గోపురం కింది భాగంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి శయనమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖమండపంలో సహజ వెలుతురు ఉండేందుకు ముఖమండపానికి 12 సోలార్ రూప్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిత్యకల్యాణ మండపంలో 500 మంది భక్తులు కూర్చుని శ్రీవారి కల్యాణాన్ని తిలకించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.3000 మంది బ్రహ్మోత్సవ మండపంలో వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపైన నిర్మాణమైన మొదటి ప్రాకారంలో బలిహరణం, నిత్యప్రదక్షిణలు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండో ప్రాకారంలో నిత్యకల్యాణ మండపం, యాగశాల, అద్దాల మండపం, రామానుజ కూటమి నిర్మాణమవుతాయి. సప్తతల రాజగోపుర నిర్మాణం నాలుగవ కర్ణకూటం పనులు జరుగుతున్నాయి. మరో రెండు కర్ణకూటముల పనులు జరగాల్సి ఉందని, దీనిపై శిఖరం అమరిస్తే ఏడో అంతస్తు పనులు చేపట్టి పూర్తి చేయనున్నారు. శివాలయం పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ప్రాకారం పనులు జరుగుతున్నాయి.








