శ్రీయాదాద్రి ప్రతినిధి : యాదాద్రి ఆలయం పూర్తిగా రాతి కట్టడం, ఆలయంలోని ఏ భాగంలోనూ ఇటుక, సిమెంటు, సున్నం వాడరు. గర్భగుడి, ముఖమండపం, మహా మండపం, ప్రాకారాలు, మండపాలన్నీ రాతితోనే నిర్మిస్తున్న ఈ ఆలయం ఆధునిక ప్రపంచ చరిత్రలో ఓ విశేషం! ఈ రాళ్లను అతికించేందుకు అలనాడు రాజుల కాలంలో ఉపయోగించిన లైమ్ మోర్బార్‌నే ఉపయోగిస్తున్నారు. ఇది మరో విశేషం. ఇందుకోసం బెల్లం, కరక్కాయ, టెంకాయపీసు మొదలైన వాటితో తయారు చేసే ఈ లైమ్ మోర్బార్ నాణ్యతను బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ప్రతి సందర్భంలోనూ తనిఖీ చేస్తున్నది. గుట్టపై ప్రతి 10 మీటర్లకు ఒక చోట భూమిని పరీక్ష నిర్వహిస్తూ నిర్మాణానికి అనుకూలంగా ఉందో, లేదో నిర్థారిస్తున్నారు. ఇది వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకూడదని నిర్మాతల తలపు. ఇది 2 సంవత్సరాల వరకు నిలిచి ఉంటుందని నిపుణులంటున్నారు. దూరదృష్టితో నిర్మిస్తున్న ఈ దివ్యక్షేత్ర నిర్మాణం వెనుక కేసీఆర్‌కు ఉన్న దార్శనికత, దక్షత దాగున్నవి. ఈ ఆలయం నిలిచి ఉన్నంతకాలం ఆయన చిరంజీవి. ముఖ్యమంత్రి మానసపుత్రికైన యాదాద్రి ఆలయ పట్టణం నిర్మాణానికి, ఆలయ పునరుద్దణకు శ్రీవైష్ణవ, శైవ మత పెద్దలూ ఇప్పటికీ ఆమోదం తెలుపడంతో పాటు నిర్మాణాలు చూసి సంతృప్తినీ వ్యక్తం చేశారు. త్రిదండి చినజీయర్ స్వామి, తొగుట పీఠాధిపతి మాధవనంద శర్మ ఆలయాల నిర్మాణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి పర్యవేక్షిస్తూ, వడివడిగా యాదాద్రి ఆలయ పట్టణం నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి తరపున ప్రతి రెండో శనివారం క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ, ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఈ కాటేజీల నిర్మాణానికి అనువైన మౌళిక వనరులు కల్పించేలా ముఖ్యమంత్రే స్వయంగా అన్ని శాఖలను సమన్వయం పరుస్తూ, అభివృద్ధికి కృషి చేస్తున్నారని, కేసీఆర్ సంకల్పమైన ఈ ఆలయ నిర్మాణం ముఖ్యమంత్రి ద్వారా దైవమే తనకు తాను నిర్మించుకుంటుందని ఆయన అంటున్నారు. వైటీడీఏ ఆధ్వర్యంలో నేడు చేపడుతున్న ఆలయ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలన్నీ రోజుకు లక్ష మంది యాంత్రీకులకు తగినట్లుగానే ఉన్నాయని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు చెబుతున్నారు.
రాళ్లు తొడిగిన సాలహారం
వెయ్యేండ్ల భారతదేశ చరిత్రలో విశాలమైన ప్రాకారలతో, ఎత్తయిన గోపురాలతో రాతి ఆలయాన్ని నిర్మించిన రాజు లేడు. విజయనగర, కాకతీయుల రాజుల తర్వాత మహాలయాలను మళ్లీ ఏ రాజు నిర్మించలేదు. రాజ్యాలు అంతరించినా ఆయా రాజులు ఆదరించిన శిల్పాకళ వాళ్లను చిరంజీవులను చేసింది. ఎక్కువకాలం నిలిచేలా రాతితోనే పటిష్టమైన ఆలయాలను నిర్మించిన ఆ స్పూర్తితో నేడు వెయ్యేండ్ల తర్వాత మళ్లీ యాదాద్రిలో పూర్తిగా రాతితో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించే శిలల కోసం అన్వేషించి ప్రకాశం జిల్లాలోని గురిజేపల్లిలో ఉన్న కృష్ణశిలను మేలైనదిగా ఎంచారు. ఇక్కడ తొలిచిన గండ శిలలను యాదాద్రి ఇతర ప్రాంతాల్లోని మొత్తం ఐదు కార్యశాలలకు తరలిస్తున్నారు. అక్కడ ఆలయ నిర్మాణానికి అనువైన స్తంభాలు, శిల్పాలుగా దొలుస్తున్నారు. వాటిని యాదాద్రి కార్యశాలకు తరలించిన తర్వాత శిల్పులు సూక్ష్మమైన అలంకరణలతో శిలలకు అందాలు జోడిస్తున్నారు. అనంతరం క్రేన్ల సాయంతో ఆ శిలలను ఒకదానిపై ఒకటి నిలుపుతూ ఆగమశిల్ప అందాలను యాదాద్రికొండపై ఆవిష్కరిస్తున్నారు.
శివా(లా)లయం
భారతీయ ప్రసిద్ధ శైవక్షేత్రాల సరసన యాదాద్రి శివాలయాన్ని నిలిపేలా అద్భుతమైన ఆలయ ప్రాంగణ నిర్మాణానికి వైటీడీఏ నడుం కట్టింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కఠిన శిలతో నిర్మించినట్లుగానే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నూతన నిర్మాణం వల్ల శివాలయం ఇంతకుముందు ఆలయం కంటే ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎకరం వైశాల్యంలో నిర్మించే శివాలయ ప్రాకారం మధ్య గర్భాలయంలోని ప్రతిష్టమూర్తికి, నందీశ్వరుడికి మధ్య స్పటిక లింగం ప్రతిష్టిస్తారు. శివుడితో పాటు ఆయన సతులిద్దరూ వేర్వేరు ఆలయాల్లో కొలువుదీరి శైవుల పూజలందుకునేలా ఆలయాలు నిర్మించారు. వీటితో పాటు గణపతి, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యస్వామి కొలువుదీరిన ఉపాలయాలూ ఈ శివాలయ ప్రాంగణంలో ఉంటాయి. జప, దాన, దోష పరిహారాల కోసం రాహు, కేతువులతో పాటు నవగ్రహాలనూ పూజించేందుకు నవగ్రహ మండపం ఈ శివాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్నారు.