శ్రీయాదాద్రి ప్రతినిధి :
దేశంలోనే అద్భుతమైన మానవ నిర్మిత ఆలయంగా ఎన్నో ప్రత్యేకతలతో స్వయంభూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సాగుతోంది. ఈ ఆలయ బాహ్య ప్రాకారం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శిల్పసంపదతో నిర్మాణం చేస్తున్నారు. సింహరూపు యాలీ పిల్లర్లు, అందమైన పద్మాలు, పుష్పాలతో మండపం శిల్ప కళాసౌరభాలతో భక్తులను ముగ్దులను చేయనుంది. ప్రధాన ఆలయ ముఖ మండపాన్ని శ్రీవైష్ణవ ధర్మ ప్రచారంలో అగ్రగణ్యులైన 12 ఆళ్వార్ స్వాములకు కృష్ణరాతి శిలలతో జీవం పోసి ఆళ్వార్ పిల్లర్లతో నిర్మాణం చేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మండలంలోనే భక్తాగ్రేసరులైన ఆళ్వారు స్వాముల దర్శనభాగ్యం కలుగనుంది. అదేవిధంగా ముఖ మండప నిర్మాణంలో కాకతీయుల కాలం నాటి శిల్పకళా సంప్రదాయపు కాకతీయ పిల్లర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

శ్రమిస్తున్న 800 మంది శిల్పులు
ఏనిమిది దశాబ్దాల క్రితపు కాకతీయ రాజుల కాలం తర్వాత అంతటి భారీ ఎత్తున రాతిశిలలు, అద్భుత శిల్పాలతో కట్టడంగా ఆధునిక చరిత్రలో సుస్థిర స్థానం పొందేవిధంగా యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. వీరిలో ఆలయ నిర్మాణ శాస్త్రంతో పాటు శిల్పకళా శాస్త్రంలో ప్రావీణ్యులైన స్తపతుల పర్యవేక్షణలో తమిళనాడుకు చెందిన శిల్పులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. ప్రకాశం జిల్లా ఆళ్లగడ్డతో పాటు యాదగిరిగుట్ట పరిసరాల్లో గుండ్లపల్లి, పాతగుట్ట ప్రాంతాల్లో ప్రత్యేకంగా శిల్పాలను తయారు చేసి ఆలయ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి తమ ఉలులతో శిలలకు ప్రాణం పోయడానికి అవిరామంగా శ్రమిస్తున్నారు.


యాదాద్రి పునర్నిర్మాణంలో ముస్లిం శిల్పకళాకారులు
కళకు కులం, మతం, ప్రాంతం అడ్డు కాదంటూ చాటుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ముస్లిం శిల్పకళాకారులు. ఆధ్యాత్మిక నగరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచేవిధంగా అద్భుత కట్టడంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి పునర్నిర్మాణంలో తమిళనాడుకు చెందిన శిల్పులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం శిల్పులు కూడా తమ శిల్పకళా నైపుణ్యంతో కీలక భూమిక పోషిస్తున్నాయి. గుంటూరు జిల్లా తుర్కపాలెం గ్రామానికి చెందిన దాదాపు 40 మంది శిల్పులు యాదాద్రి దివ్యక్షేత్ర పునర్నిర్మాణానికి అవసరమైన శిల్పాల తయారీకి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. హిందూధర్మ ప్రకారం స్తపతులు సూచించిన మూర్తులకు తమ ఉలితో శిలలకు జీవం పోస్తున్నారు. ముస్లిం మత సంప్రదాయాలను పాటించే కళాకారులు ముత్తాతల కాలం నుంచే ఆలయ నిర్మాణాలకు శిల్పాలు చెక్కడం చేస్తున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోళులు, పల్లవుల, కాకతీయ కాలం నాటి శిల్పకళా రీతుల్లో శిల్పాలు చెక్కడంతో తర్పీదు పొందారు. అప్పటి నుంచి వారసత్వంగా తమ కుటుంబాలు శిల్పాల తయారీ పనులు కొనసాగిస్తూ ఆలయ నిర్మాణాల్లో భాగస్వాములవుతున్నట్లు యాదాద్రి నిర్మాణానికి శిల్పి పనులు చేస్తున్న యూనీస్ అనే ముస్లిం శిల్పకళాకారుడు తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో అత్యంత భారీ శిల్పం యాలీ పిల్లర్లను నిర్ధేశిత గడువు కంటే ముందే పనులు పూర్తి చేయడం ఎంతో సంతోషం ఉందని ఆలయ స్తపతులు తెలిపారు. తాము పాటిస్తున్న ధర్మం ఇస్లాం అయినప్పటికీ జీవనోపాధి కోసం హిందూ ఆలయాల నిర్మాణాలకు పనిచేస్తున్నామని యూనీస్ తెలిపారు. పాతగుట్ట వద్ద గల శిల్పాల తయారీ కేంద్రంలో ముస్లిం శిల్పులు ఆలయ నిర్మాణం పోదిగ, సాలాగారం, కర్ణకూటం, బాలపాదంతో పాటు యాలీ పిల్లర్లను శిలలపై చెక్కుతున్నారు. మతం ఏదైనా ఒక్కటేనని, కోట్లాది మంది భక్తితో కొలిచే యాదాద్రి ఆలయాన్ని చరిత్రలో నిలిచేవిధంగా ఆలయం పునర్నిర్మాణంలో భాగస్వాములం కావడం ఎంతో సంతోషం ఉందంటున్నారు.