యాదాద్రి రెండో ఘాట్‌రోడ్డులో వెలుగుల జిలుగులు
శ్రీయాదాద్రి ప్రతినిధి : ఇటలీలోని నెరీ టెక్నాలజిని లైటింగ్ విధానంలో ఉపయోగించి క్యాస్ట్ ఐరన్‌తో తయారు చేసిన లైటింగ్ పోల్స్ సంప్రదాయం ఉట్టిపడేలా ఉండడంతో పాటు విద్యుత్ వెలుగులు పండువెన్నెలను తలపిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేసి రెండవ ఘాట్‌రోడ్డు వెంట అమర్చిన ఎల్ఈడీ లైట్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లైటింగ్ డిజైన్‌ను ప్రముఖ ఆర్కిటెక్టు ఆనందసాయి తయారు చేసి ఇవ్వగా నెరీ లైటింగ్ విధానాన్ని ఇటలీలో తయారు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఘాట్‌రోడ్డు మార్గంలో క్యాస్ట్ ఐరన్‌తో తయారు చేసిన 50 లైటింగ్ పోల్స్ కు అమర్చిన విద్యుద్దీపాలు పండువెన్నెలను తలపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైటీడీఏ చైర్మన్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణ ఆకట్టుకుంటున్నది. ఇటలీ దేశానికి చెందిన నెరీ సంస్థ తయారు చేసిన ఎల్ఈడీ వెలుగులను విరజిమ్ముతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించినప్పుడు చేసిన సూచనల్లో భాగంగానే నెరీ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. యాదాద్రిలో జరుగుతున్న పనులపై మంత్రి జగదీష్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌లు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆహ్లాదం.. ఆధ్యాత్మికం ఉట్టిపడేలా…
కొండపైకి రోడ్డు ద్వారా ప్రయాణికులకు ఆహ్లాదకరంగా.. ఆధ్యాత్మికంగా ఉండాలని యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ యాదాద్రి మొదటి, రెండవ ఘాట్‌రోడ్డులో అద్భుతమైన విద్యుద్దీపాలంకరణ నూతన సంప్రదాయన్ని.. వారసత్వాన్ని గుర్తు చేసేవిధంగా డిజైన్ తయారు చేశారు. ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా క్యాస్ట్ ఐరన్‌తో లైటింగ్ పోల్స్ తయారు చేశారు. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ ఆధారిటి వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈఓ ఎన్.గీతలు ప్రత్యేక శ్రద్ధతో ఆర్కిటెక్టు ఆనందసాయితో తయారు చేయించిన డిజైన్‌తో ప్రస్తుతం విద్యుద్దీపాలతో రెండో ఘాట్‌రోడ్డు నూతన వైకుంఠంకు వెళ్లే రహదారిలాగా కన్పిస్తోంది. నెరీ సంస్థ దేశవిదేశాలలో అనేక వ్యాపారాలు, ప్రభుత్వ విద్యుత్ పనులు చేశారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల ముఖ్య ప్రదేశాలలో, ఇతర దేశాలు అమెరికా, యూరోతో పాటు దుబాయి దేశాలలో ఈ సంస్థ వారు వారసత్వంగా వస్తున్న వాటిని కాపాడేవిధంగా విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేస్తున్నారు. రెండో ఘాట్‌రోడ్డుపై 50 పోల్స్‌నకు గాను రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. ఘాట్‌రోడ్డులో ఏర్పాటు చేసిన లైటింగ్స్‌ను ఆర్ ఆండ్ బీ ఎస్ఈ వై.లింగారెడ్డి, ఈఈ శ్రీనాధ్, డీఈ సంజయ్, ఏఈఈ వి.వి. రామారావులు పర్యవేక్షిస్తున్నారు.

ఆకట్టుకుంటున్న నెరీ లైటింగ్ ఎల్ఈడీ లైట్లు